N Biren Singh: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా

Manipur CM Biren Singh resigned

  • మణిపూర్ లో కొన్నాళ్లుగా జాతుల మధ్య వైరం
  • నాయకత్వ మార్పు తథ్యమంటూ కొన్నిరోజులుగా వార్తలు
  • నేడు ఢిల్లీ వెళ్లి నడ్డా, అమిత్ షాలను కలిసిన బీరెన్ సింగ్
  • సాయంత్రానికి రాజీనామా

కొన్నేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. బడ్జెట్ సమావేశాల సమయంలో బీరెన్ సింగ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

రాజీనామా నేపథ్యంలో బీరెన్ సింగ్ మాట్లాడుతూ... మణిపూర్ ప్రజలకు సీఎంగా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిపూర్ కు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. మణిపూర్ లో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టిందని, ఇకపై కూడా అభివృద్ధి పనులు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

మణిపూర్ లో నాయకత్వ మార్పు తథ్యమని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇవాళ ఉదయం బీరెన్ సింగ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాలను కలిశారు. సాయంత్రానికి బీరెన్ సింగ్ రాజీనామా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

2023 మే నెలలో మణిపూర్ లో జాతుల మధ్య వైరం భగ్గుమంది. తీవ్రస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఇటీవల నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఇది జరిగిన కొన్ని రోజులకే నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కూడా మణిపూర్ బీజేపీ సర్కారుకు కటీఫ్ చెప్పింది. 

మణిపూర్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 60. ప్రస్తుతం బీజేపీ బలం 37. మరో ఎనిమిది మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకు మద్దతుగా ఉన్నారు.

N Biren Singh
CM
Manipur
Resignation
BJP
  • Loading...

More Telugu News