KTR: బీసీ జనాభా తగ్గించి చూపడంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

- తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం
- అనంతరం ప్రెస్ మీట్
- బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు
- బీసీ జనాభా గణనపై రీ సర్వే చేపట్టాలని డిమాండ్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో తమ పార్టీలోని బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల తీసుకువచ్చిన కులగణన సర్వే నివేదికలో బీసీ జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని ఆరోపించారు. దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చూపించారని మండిపడ్డారు. బీసీ జనాభాను తగ్గించి చూపడంపై సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కులగణన పూర్తిగా తప్పుల తడక అని, అశాస్త్రీయం అని విమర్శించారు. కులగణన చిత్తు కాగితంతో సమానమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగలబెట్టాడని వెల్లడించారు. బీసీ జనాభాపై రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.