Arvind Kejriwal: నాడు తల్లి ఓటమి.. నేడు కొడుకు ప్రతీకారమా?

- 2013లో కేజ్రీవాల్ పై ఓటమితో షీలా దీక్షిత్ పొలిటికల్ కెరీర్ క్లోజ్
- తాజా ఎన్నికల్లో ఓట్లు చీల్చి కేజ్రీవాల్ ఓటమికి పరోక్షంగా కారణమైన సందీప్ దీక్షిత్
- న్యూఢిల్లీ నియోజకవర్గంలో 4 వేల పైచిలుకు ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి
- దాదాపుగా అంతే మొత్తం ఓట్లతో కేజ్రీవాల్ చేయి జారిన గెలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవడం గమనార్హం. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ పోటీపడగా.. ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్, బీజేపీ నుంచి పర్వేశ్ వర్మ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పర్వేశ్ వర్మ 30,088 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్ పై 4089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేజ్రీవాల్ కు మొత్తం 25,999 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 4568 ఓట్లు సాధించారు.
కౌంటింగ్ లో పర్వేశ్ వర్మ, కేజ్రీవాల్ మధ్య రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారుతూ వచ్చింది. స్వల్ప ఆధిక్యంలో ఫలితం ఇద్దరు నేతల మధ్య దోబూచులాడింది. చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యాక పర్వేశ్ కు వచ్చిన మెజారిటీ, సందీప్ దీక్షిత్ కు పోలయిన ఓట్లు దాదాపుగా సమానం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను చీల్చి కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్ ఉమ్మడిగా పోటీ చేస్తే న్యూఢిల్లీ ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారు.
ఆప్ ఆవిర్భవించిన 2013 ఎన్నికల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ ను కేజ్రీవాల్ ఓడించారు. ఈ ఓటమితో షీలా దీక్షిత్ పొలిటికల్ కెరీర్ క్లోజ్ ముగిసింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను బరిలోకి దింపింది. ఫలితాల్లో ఓట్లను చీల్చడం ద్వారా కేజ్రీవాల్ ఓటమికి కారణమై, తల్లి ఓటమికి సందీప్ దీక్షిత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.