Manish Sisodia: మనీశ్ సిసోడియా ఓటమితో ‘ఆప్’ మాజీ నేత కుమార్ విశ్వాస్ భార్య కన్నీళ్లు.. బాధతో మాత్రం కాదట!

- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ పరాజయం
- జంగ్‌పురా నుంచి పోటీ చేసిన మనీశ్ సిసోడియా ఓటమి
- విషయం తెలిసిన వెంటనే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆప్’ మాజీ నేత భార్య
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన మనీశ్ సిసోడియా ఎన్నికల్లో ఓడిపోయారన్న విషయం తెలియగానే ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ భార్య ఏడ్చేశారు. అయితే, ఆయన ఓడిపోయారన్న బాధతో కాదు.. తన మాట నిజమైందన్న ఆనందంతో. ఈ విషయాన్ని కుమార్ విశ్వాస్ స్వయంగా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేసిన మనీశ్ సిసోడియా.. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మార్వా చేతిలో పరాజయం పాలయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్య మనీశ్ ఓటమి విషయం తెలిసిన వెంటనే ఏడ్చేశారని కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా గతంలో తన భార్యకు, మనీశ్ సిసోడియాకు మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. తన భార్య మనీశ్‌తో మాట్లాడుతూ.. ‘భయ్యా మీరెప్పుడూ అధికారంలో ఉండబోరు’ అని చెప్పిందని, దానికి సిసోడియా కొంత ఆవేశంగా స్పందిస్తూ.. ‘ఇప్పుడైతే అధికారంలోనే ఉన్నాను కదా’ అని బదులిచ్చారని తెలిపారు. అది ఆయన అతి విశ్వాసానికి, అహంకారానికి నిదర్శనమని చెప్పారు. ఇప్పుడు ఆయన ఓటమితో తన భార్య మాట నిజమై కన్నీళ్లు పెట్టుకుందని వివరించారు.