School Girls: స్కూల్ యూనిఫాంలో చెట్టుకు ఉరివేసుకున్న ఇద్దరు బాలికలు

- ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో ఘటన
- రెండ్రోజుల క్రితం అదృశ్యమైన బాలికలు
- సమీపంలోని అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన విద్యార్థినులు
ఒడిశాలో ఇద్దరు బాలికలు స్కూలు యూనిఫాంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. మల్కనగిరి జిల్లాలో నిన్న జరిగిందీ ఘటన. బాధిత బాలికలు ఇద్దరు రెండ్రోజుల క్రితం అదృశ్యమయ్యారు. వారిలో ఒకరిని ఎంవీ74 గ్రామానికి చెందిన జ్యోతి హవల్దార్ (13), మరో బాలికను ఎంవీ 126 గ్రామానికి చెందిన మందిరా సోది (13)గా గుర్తించారు. వీరిద్దరూ స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు.
బాలికలు ఇద్దరూ గురువారం నుంచి కనిపించడం లేదు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతున్న బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను దించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే, ఎవరైనా చంపి వారిని చెట్టుకు వేలాడదీశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.