Ram Gopal Varma: విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ వ్యంగ్య పోస్ట్

- ‘ఐలవ్ ఒంగోల్.. అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్, త్రీ చీర్స్’ అంటూ వర్మ పోస్ట్
- విచారణ అనంతరం గంటన్నరలోనే పోస్ట్
- వైసీపీ జిల్లా కార్యాలయంలో ఫోన్ వదిలి వచ్చిన వర్మ!
- ఫోన్ కోసం వెళ్లిన పోలీసులపై చెవిరెడ్డి వాగ్వివాదం
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటికి అనుచిత వ్యాఖ్యలు జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన గంటన్నర వ్యవధిలోనే వ్యంగ్యంగా చేసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఐ లవ్ ఒంగోల్.. అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్, త్రీ ఛీర్స్’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇప్పుడు దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒంగోలు పోలీసులను ఆయన ప్రశంసించారా? లేదంటే, గంటల తరబడి ప్రశ్నించినా తనను ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారా? అన్న చర్చ మొదలైంది.
కాగా, విచారణ సమయంలో మొబైల్ ఫోన్‌ను తమకు అప్పగించాలని పోలీసులు వర్మను కోరగా, అది తన మేనల్లుడి వద్ద కారులో ఉందని, అతడు హైదరాబాద్ వెళ్లిపోయాడని పోలీసులకు వర్మ బదులిచ్చారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు వర్మ ఫోన్ లొకేషన్‌ను చెక్ చేయగా అది వైసీపీ జిల్లా కార్యాలయంలో ఉన్నట్టు చూపించింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఫోన్ కోసం ఆరా తీశారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బయటకు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వర్మ ఫోన్ ఇక్కడ ఎందుకు ఉంటుందని చెప్పడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు.