Veljan Group: మనవడి చేతిలో పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య.. తల్లి చూస్తుండగానే 73 సార్లు పొడిచి చంపిన వైనం!

Veljan group owner Janardhan Rao killed by his own grand son in Hyd

  • తల్లితో కలిసి వచ్చి దారుణంగా హత్య చేసిన మనవడు
  • అడ్డుకోబోయిన తల్లిపైనా నాలుగు చోట్ల కత్తితో దాడి
  • ఆస్తి తగాదాలే కారణం.. డ్రగ్స్‌కు బానిసై ఉంటాడని అనుమానం

ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు (86) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌, సోమాజీగూడలోని తన నివాసంలో సొంత మనవడే ఆయనను అత్యంత పాశవికంగా 73సార్లు పొడిచి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనార్దనరావుది ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు. కొంతకాలంగా ఆయన సోమాజీగూడలో ఉంటున్నారు. 

తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను ఇటీవల వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్‌గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ (29) పేరిట రూ. 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆస్తుల కోసం కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సరోజినీదేవి గురువారం రాత్రి కుమారుడు కీర్తితేజతో కలిసి తండ్రిని కలిసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాడివేడిగా వాగ్వివాదం జరిగింది.

తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా, ఇదే అదునుగా భావించిన కీర్తితేజ వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్‌పై దాడిచేశాడు. తండ్రి అరుపులు విని వచ్చిన తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపైనా దాడిచేసి నాలుగు చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు అడ్డుకునేందుకు ప్రయత్నించగా రావొద్దని హెచ్చరించాడు. అత్యంత కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడవడంతో జనార్దనరావు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిన్న పంజాగుట్టలో నిందితుడు కీర్తితేజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుమారుడి దాడిలో గాయపడిన సరోజినీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు కీర్తితేజ డ్రగ్స్‌కు బానిసైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జనార్దనరావు గతంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 40 కోట్లు విరాళం ఇచ్చారు.

  • Loading...

More Telugu News