Undavalli Arun Kumar: వైసీపీలో చేరనున్న ఉండవల్లి!

- ఈ నెల 26న ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం
- ఇటీవల మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిక
- మరి కొందరు సీనియర్ నేతలను వైసీపీలోకి జగన్ ఆహ్వానించారని టాక్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు పార్టీకి వీడ్కోలు పలికి ఇతర పార్టీలలో చేరుతున్నా, పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించినా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ భరోసా ఇస్తున్నారు.
మరోవైపు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు సన్నిహితంగా ఉన్న సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతలను జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను పార్టీలో చేర్చుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, చేరిక ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 26న వైసీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు తదితర రాష్ట్ర సమస్యలపై మీడియా ముందు మాట్లాడటం, రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను మీడియా ముందు చెప్పడం లాంటివి చేస్తూనే ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, కొన్ని నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చారు.
అయితే, ఉండవల్లి చేరిక వైసీపీకి నూతనోత్సాహం ఇస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఉండవల్లి బాటలోనే మరి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఉండవల్లి చేరికపై ఆయన నుంచి ఇంత వరకూ అధికారికంగా అయితే సమాచారం రాలేదు. జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడంతో ఉండవల్లి చేరిక దాదాపు ఖాయమని భావిస్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డితో ఉండవల్లి అరుణ్ కుమార్ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.