BJP: ఆ మూడు గుణాల వల్లే నా భర్తను పోటీకి దింపారు: పర్వేశ్ వర్మ అర్ధాంగి ఆసక్తికర వ్యాఖ్యలు

- కష్టపడే తత్వం, ఎంచుకున్న పని పూర్తి చేసే నైజం, అవినీతి మచ్చలేని వ్యక్తి అన్న స్వాతి సింగ్
- ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే పర్వేశ్ వర్మ భిన్నంగా ఉంటాడన్న భార్య
- ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారని వ్యాఖ్య
కష్టపడి పని చేసే స్వభావం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే నైజం, అవినీతిరహితంగా పనిచేయడం... ఈ మూడు గుణాలు తన భర్తలో ఉన్నందునే అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తన భర్తను పోటీకి నిలిపిందని పర్వేశ్ వర్మ భార్య స్వాతి సింగ్ వర్మ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ 4 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ క్రమంలో ఆయన భార్య స్పందించారు.
తన భర్త గెలుపుపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే తన భర్త భిన్నంగా ఉంటారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారని ఆమె అన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయగల ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. గత పదకొండు సంవత్సరాలుగా వారు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు కథనాలతో మోసపోయారన్నారు. ఈ విషయాన్ని గుర్తించినందునే ప్రజలు బీజేపీని గెలిపించారని ఆమె అన్నారు.
పర్వేశ్ వర్మ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారనే ప్రచారంపై కూడా స్వాతి సింగ్ స్పందించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా ఢిల్లీ అభివృద్ధి కోసం ఆయన పని చేస్తారన్నారు. గతంలో మాదిరిగా తన భర్త విజయం కోసం తాను ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశానని ఆమె తెలిపారు.
స్వాతి సింగ్ వర్మ... కేంద్ర మాజీ మంత్రి విక్రమ్ వర్మ కుమార్తె.