Revanth Reddy: హైదరాబాద్‌లోని కొత్త ఫ్లైఓవర్లపై లోతుగా అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

- పలు ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష
- మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 90 రోజుల్లో డీపీఆర్ తయారు చేయాలన్న ముఖ్యమంత్రి
- రహదారుల విస్తరణపై పలు సూచనలు
హైదరాబాద్‌లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 90 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని, 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ చెరువుపై అధికారులు మూడు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించారు. సుమారు 2.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులు సూచించారు.
రెండు రోజుల్లో మార్పులు, చేర్పులు చేసి పూర్తి సమాచారంతో తిరిగి రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మీరాలం బ్రిడ్జిని ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. అదే సమయంలో, హైదరాబాద్‌లో రహదారుల విస్తరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.