Telangana: 'మీసేవ' కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ స్పష్టత

- మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న పౌరసరఫరాల శాఖ
- ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులనే ఆన్‌లైన్ చేయిస్తున్నామన్న పౌరసరఫరాల శాఖ
- మార్పులకు, చేర్పులకు సంబంధించి మీ సేవ ద్వారా దరఖాస్తులు అందుతున్నాయని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణపై పౌరసరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది.
ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే మీసేవను కోరినట్లు స్పష్టం చేసింది. అయితే, రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు మీసేవ ద్వారా స్వీకరించబడుతున్నాయని తెలిపింది.
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే వార్తలు రావడంతో, ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేసిందని కొందరు ప్రచారం చేశారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తమను పౌరసరఫరాల శాఖ కానీ, మీసేవ కానీ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.