Rahul Gandhi: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ట్వీట్

- ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామన్న రాహుల్ గాంధీ
- ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య
- కార్యకర్తలకు, పార్టీకి ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ గాంధీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, తమ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. కాలుష్యం, ద్రవ్యోల్బణం, అవినీతి పైనా... ఢిల్లీ అభివృద్ధి కోసం, ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. అయితే, తమ ఓటు బ్యాంకు గతంలో కంటే పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2030లో తాము అధికారంలోకి వస్తామని జైరాం రమేశ్ వంటి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.