Ram lakshman: అన్నంలో నీళ్లు కలుపుకుని తింటుంటే కన్నీళ్లొచ్చాయి: రామ్ లక్ష్మణ్!

Ram Lakshman Interview

  • ఫైట్ మాస్టర్లుగా రాణించిన రామ్ లక్ష్మణ్
  • పొలం పనులు చేయడం అలవాటన్న ఫైట్ మాస్టర్స్  
  • 350 రూపాయలతో చెన్నెలో అడుగుపెట్టామని వెల్లడి
  • ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డామని వివరణ   


టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ కి మంచిపేరు ఉంది. రామ్ లక్ష్మణ్ కి ముందు... ఆ తరువాత కూడా చాలామంది ఫైట్ మాస్టర్లు వచ్చారు. కానీ రామ్ లక్ష్మణ్ మాత్రమే బలంగా నిలబడ్డారు. అందుకు కారణం వాళ్ల టాలెంట్ మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా. పుస్తకాల కంటే జీవితాన్ని ఎక్కువగా చదవడం వల్లనే వాళ్లు పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారని చెప్పవచ్చు.  అలాంటి రామ్ లక్ష్మణ్ 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

"మేం పల్లెటూళ్లో పుట్టి పెరిగాం. పొలం పనులు చేసే వాళ్లం. పంచె కాకుండా ప్యాంటు వేసుకుంటే గొప్ప అనుకునే రోజులు అవి. జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్లాము. ఫైట్ మాస్టర్స్ గా పని చేయాలని నిర్ణయించుకున్నాం. 350 రూపాయలతో చెన్నై వెళ్లిన మేము, అన్నం కోసం పది కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి" అని అన్నారు. 

"ఒకసారి మా రూమ్ దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ కి వచ్చినవారికి మేమే వడ్డించాము. మమ్మల్ని కూడా అక్కడ తినమంటారని అనుకున్నాం. కానీ వాళ్లు అలా అనకపోవడం వలన రూమ్ కి వచ్చి అన్నం వండుకున్నాం. అప్పటికే సాయంత్రం అయింది. కూరలు ఏమీ లేకపోవడం వలన నీళ్లు పోసుకుని తినేశాము. అప్పుడు మాత్రం మాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంటి దగ్గర ఏదో ఒకటి వేసుకుని నాలుగు పూటలా అన్నం తినడం మాకు అలవాటు. ఆ రోజున అప్పటివరకూ ఏమీ తినకుండా ఆకలితో ఉండి, వండుకోవలసి రావడం మరచిపోలేము" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News