Swati Maliwal: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు పరాభవం... ఎంపీ స్వాతి మలివాల్ ట్వీట్ వైరల్!

- ద్రౌపది వస్త్రాపహరణం ఫొటోతో స్వాతి మలివాల్ ట్వీట్
- దీనిపై తమదైనశైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
- ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల ఘోర పరాజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం 'ద్రౌపది వస్త్రాపహరణం' ఫొటోతో తన అభిప్రాయాన్ని ఆమె వ్యక్తపరిచారు.
దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకరు, ఇంపాక్ట్ ప్లేయర్ అని మరొకరు, ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారు అని ఇంకొకరు కామెంట్ చేశారు. స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని అంటున్నారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి వైపు పయనిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు పరాజయం పాలవుతున్నారు. ఇప్పటికే ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం పాలయ్యారు. ఈ తరుణంలో స్వాతి మలివాల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
గతంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన నివాసంలోనే తనపై దాడి జరిగిందంటూ స్వాతి మలివాల్ సంచలనం సృష్టించడం తెలిసిందే.