Manoj Tiwari: యమునా శాపం వల్లే ఆప్ ఓడిపోయింది: మనోజ్ తివారీ

AAP lost because of Yamuna river curse says Manoj Tiwari
  • ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తీరని ద్రోహం చేశారన్న తివారీ
  • ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేశారని విమర్శ
  • మంచి నీటికి బదులుగా మద్యం పంపిణీ చేశారని మండిపాటు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 51 స్థానాల్లో ముందంజలో ఉండగా... ఆప్ కేవలం 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. 

ఫలితాల సరళిపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందిస్తూ... యమునా నది శాపం తగలడం వల్లే ఆప్ ఓడిపోయిందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం ఖరారయిందని తెలిపారు. తమ ప్రభుత్వం కొలువుదీరబోతోందని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తీరని ద్రోహం చేశారని... ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేశారని విమర్శించారు. బస్సు డ్రైవర్లను తొలగించడమే కాకుండా, వారి పెన్షన్ ను కూడా నిలిపివేశారని మండిపడ్డారు. 

ఆయుష్మాన్ భవ ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేశారని దుయ్యబట్టారు. మంచి నీటికి బదులుగా మద్యం పంపిణీ చేశారని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరోగ్య పథకాలపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం యమునా నదిని పరిశుభ్రంగా మారుస్తుందని అన్నారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు యమునా తీరానికి వెళ్లేలా సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. యమునలో మునిగేలా నదిని శుభ్రపరుస్తామని తెలిపారు.
Manoj Tiwari

More Telugu News