Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్ రావు

- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా
- రెండో స్థానంలో ఆప్
- కనీసం బోణీ కొట్టని కాంగ్రెస్
- ఈ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ పాత్ర అమోఘం అంటూ హరీశ్ ట్వీట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేకపోవడం పట్ల ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలిందంటూ ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ... ఈ ఘోర పరాజయాల్లో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అంటూ ట్వీట్ చేశారు.
"ఇక్కడ (తెలంగాణ) హామీలు అమలు చేయకుండా... ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన బెడిసికొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి.
6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ! లేదంటే... మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు" అంటూ హరీశ్ రావు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు... బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 11 చోట్ల గెలిచి మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.