CM Atishi: కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: సీఎం అతిశీ

- దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- ఆప్ పార్టీ 28 స్థానల్లో ఆధిక్యం... బీజేపీ 42 చోట్ల లీడ్
- ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న బీజేపీ
- అప్పుడే ఎన్నికల ఫలితాలపై తొందరపడొద్దని సీఎం అతిశీ వ్యాఖ్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన కౌంటింగ్ లెక్కలు గంట గంటకు మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.
అధికార ఆప్ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... బీజేపీ 42 చోట్ల లీడ్‌లో కొనసాగుతోంది. సీఎం అతిశీ తాను పోటీ చేసిన కల్కాజీ నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆప్ పార్టీ విజయం సాధిస్తుందని, కేజ్రీవాల్ నాలుగోసారి సీఎం కావడం ఖాయమని అతిశీ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే ఫలితాలపై తొందరపడొద్దని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు గాను 36 చోట్ల గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఢిల్లీ పగ్గాలు దక్కేది ఎవరికి అనేది మధ్యాహ్నంకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.