Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఖాతా తెరవనున్న కాంగ్రెస్

- గత రెండు దఫాలుగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని వైనం
- ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలలో బాద్లీలో లీడ్
- రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారం చేసినా నిష్ప్రయోజనమే
ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా వెనుకంజలోనే కొనసాగుతుండగా ఒక్క బాద్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాద్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, పార్టీ జాతీయ కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సేవలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆమె కుమారుడిని బరిలో నిలిపినా ఉపయోగం లేకుండా పోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు.