Team India: టీమిండియా ఆటగాళ్లకు వజ్రపుటుంగరాలు అందజేసిన బీసీసీఐ.. కారణమిదే!

- గతేడాది టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టు
- అప్పట్లో రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన బీసీసీఐ
- తాజాగా ప్రత్యేకంగా తయారుచేసిన వజ్రపుటుంగరాల బహూకరణ
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వజ్రపుటుంగరాలను బహూకరించింది. ఇటీవల నిర్వహించిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఉంగరాలను అందించింది. నీలం, బంగారు వర్ణ సమ్మేళనంతో ఉన్న ఉంగరం పైభాగంలో ‘టీ20 ప్రపంచ చాంపియన్ ఇండియా’ అన్న అక్షరాలతోపాటు అశోక చక్రం కూడా ఉంది. ఉంగరానికి ఇరు వైపులా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లు, జట్టు ఎంత తేడాతో విజయం సాధించిందో కూడా చెక్కించారు.
ఈ వజ్రపుటుంగరాల బహూకరణ వెనక పెద్ద కారణమే ఉంది. గతేడాది వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండోసారి టీ20కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. అక్కడితో సరిపెట్టకుండా ఇప్పుడిలా వజ్రపుటుంగరాలను కూడా బహూకరించింది.