Jogulamba Gadwal District: ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించిన యువకుడి కథ విషాదాంతం

- ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన నవీన్
- పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే, గద్వాల పట్టణంలోని చింతలపేటకు చెందిన నవీన్ (25) అనే యువకుడు కొంతకాలంగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన నవీన్ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ గురువారం రాత్రి మృతి చెందాడు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.