Ram Gopal Varma: 9 గంటల పాటు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించిన ప్రకాశం జిల్లా పోలీసులు

- సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారం
- ఒంగోలు రూరల్ పీఎస్ లో వర్మను విచారించిన పోలీసులు
- మరోసారి విచారణకు రావాలని సూచన
- తాజాగా, వర్మకు నోటీసులు అందించిన సీఐడీ పోలీసులు
చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియాలో ఫొటోలతో పోస్టులు పెట్టిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు విచారించారు. సీఐ శ్రీకాంత్ బాబు... వర్మను పలు అంశాలపై ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం... మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని వర్మకు పోలీసులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అటు సీఐడీ పోలీసులు కూడా వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ ఒంగోలు వచ్చిన సీఐడీ పోలీసులు... వర్మకు నోటీసులు అందించారు. గతేడాది నవంబరు 29న నమోదైన కేసులో సీఐడీ పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులు, ఆ పోస్టుల్లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ కులాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు.