Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఏడుగురు పాక్ చొరబాటుదారుల హతం

- కశ్మీర్ లో భారత భద్రతా బలగాలకు విజయం
- చొరబాట్లకు యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదులు
- పాక్ ప్రయత్నాన్ని దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
జమ్మూకశ్మీర్ లో భారత భద్రతా బలగాలకు భారీ విజయం చేకూరింది. సరిహద్దులో చొరబాట్లకు పాల్పడుతున్న ఏడుగురు పాకిస్థాన్ జాతీయులను భారత సైన్యం మట్టుబెట్టింది. వారిలో ఇద్దరు ముగ్గురు పాక్ సైనికులు ఉండొచ్చని సైన్యం భావిస్తోంది.
ఫిబ్రవరి 5వ తేదీని పాక్ కశ్మీర్ సంఘీభావ దినంగా పాటిస్తోంది. ఈ సందర్భంగా భారత్ లో చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నించారు. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో కృష్ణా ఘాటి వద్ద టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత జవాన్లు భగ్నం చేశారు.
ఉగ్రవాదులు చొరబడేందుకు వీలుగా భారత సైన్యం దృష్టి మరల్చేందుకు పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) కాల్పులకు తెగబడింది. ఓ భారత సైనిక పోస్టుపై కాల్పులు జరిపింది. ఈ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఈ ఘటనలోనే ఏడుగురు పాకిస్థానీలు హతమయ్యారు. మృతుల్లో పలువురు అల్ బదర్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన వారు ఉన్నట్టు భావిస్తున్నారు.