Revanth Reddy: కేబినెట్ విస్తరణ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనన్న రేవంత్ రెడ్డి
- మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందన్న ముఖ్యమంత్రి
- రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. తాను మాత్రం ఎవరి పేరునూ ప్రతిపాదించడం లేదన్నారు.
ప్రతిపక్ష నేతలపై కేసుల విషయమై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళతామన్నారు. ప్రతిపక్ష నేతలను త్వరగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తాము పని చేస్తున్నామని ఆయన అన్నారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తాము కుల గణన సర్వే చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. కుల గణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లవుతుందన్నారు. కుల గణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగినట్లు తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, రెండ్రోజుల్లో ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదు
తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ను కోరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీతో తన అనుబంధంపై తెలియని వాళ్లు మాట్లాడితే తనకేం సంబంధమన్నారు. ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయని ఆయన తెలిపారు.
పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే తాను ముందుకు సాగుతానన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు. తనకు పని చేసుకుంటూ వెళ్లడమే తెలుసునని, ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.