Election Commission: రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

- మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపణ
- రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను, సూచనలను గౌరవిస్తున్నామన్న ఈసీ
- త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం
రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను, చేసిన సూచనలను తాము గౌరవిస్తున్నామని, వాటిపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఈ విధంగా స్పందించింది. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించిన పూర్తి వాస్తవాలను, విధానపరమైన అంశాలతో కూడిన సమాధానాన్ని కమిషన్ అందజేస్తుందని తెలిపింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు ఒక బృందంగా ఏర్పడి ఓటర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తున్నాయని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లను మరో కేంద్రానికి మార్చారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను తమకు ఇవ్వాలని ఈసీని కోరామని ఆయన తెలిపారు. దీని ద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఎంతమంది ఓటర్లను తొలగించారో, ఎంతమందిని ఒక బూత్ నుంచి మరో బూత్‌కు బదిలీ చేశారో కూడా తెలుస్తుందన్నారు. అయితే, దీనికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని, అందుకే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ ఆసక్తి చూపడం లేదని ఆయన విమర్శించారు.