RBI: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

- భారత బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక బ్యాంక్.ఇన్
- నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకైతే ఫిన్.ఇన్ డొమైన్
- ఏప్రిల్ నుంచి బ్యాంక్.ఇన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయమన్న ఆర్‌బీఐ గవర్నర్
పెరుగుతున్న ఆర్థిక మోసాలను ఆరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ కలిగి ఉండాలని, అలాగే నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకైతే ఫిన్.ఇన్ డొమైన్ ఉండాలని సూచించింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న వేళ... బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఇందులో భాగంగానే బ్యాంకు డొమైన్లు ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో బ్యాంక్.ఇన్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంక్.ఇన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ఫిన్.ఇన్ రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నట్లు గవర్నర్ చెప్పారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) దీనికి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుంది.
అలాగే దేశంలో జారీ అయిన కార్డుల ద్వారా ఇతర దేశాలలో జరిగే లావాదేవీలకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను జోడించనున్నట్లు కూడా గవర్నర్ తెలిపారు. ఇతర దేశాల్లో మర్చంట్ ఉన్నప్పుడు సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి ఈ పద్ధతిని తీసుకొస్తున్నట్లు చెప్పారు.