Alapati Raja: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆలపాటి రాజా

- గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
- గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి
- కలెక్టరేట్ వరకు కూటమి శ్రేణుల భారీ ర్యాలీ
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా నామినేషన్ వేశారు. గుంటూరు కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి నాగలక్ష్మికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు.
నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆలపాటి రాజా సరైన అభ్యర్థి అని చెప్పారు. వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి బాటలో పెడుతున్నారని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చరిత్రలో లిఖించబడిందని అన్నారు. జగన్ 1.0ని చూసిన ప్రజలు 2.0లో ఏం జరుగుతుందో అని భయపడుతున్నారని చెప్పారు. జగన్ ఒక అపోహలో బతుకుతుంటారని... మొన్నటి ఫలితాలు చూసి కూడా ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు.