R Krishnaiah: సీఎం రేవంత్ బీసీలకు వ్యతిరేకిగా మారారు.. ఆ పని చేయకపోతే ఆయన చిట్టా విప్పుతాం: ఆర్ కృష్ణయ్య

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతామని కృష్ణయ్య హెచ్చరిక
- రాష్ట్రంలో బీసీలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేసిందంటూ ఆరోపణ
- బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం అనేది ఇందులో భాగమేనన్న ఎంపీ
- తెలంగాణ సర్కార్ చేసిన కులగణన తప్పుల తడక అని మండిపాటు
సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు వ్యతిరేకిగా మారారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచకపోతే ఆయన చిట్టా విప్పుతామని హెచ్చరించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా కృష్ణయ్య మాట్లాడుతూ... రాష్ట్రంలో బీసీలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం ద్వారా అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ చేసిన కులగణన తప్పుల తడక అని దుయ్యబట్టారు.
కులగణనలో బీసీల జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించారని అన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ర అని కృష్ణయ్య రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కావాలనే వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.