cs k vijay anand: ఏపీలో ఉగాది నుంచి పి-4 విధానం అమలు: సీఎస్ విజయానంద్

cs k vijay anand announces implementation of p4 model from upcoming ugadi

  • పి-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్స్) విధానం అమలుకు చర్యలు 
  • పి-4 విధానంపై అధికారులతో సీఎస్ సమీక్ష  
  • పేదరిక నిర్మూలనే లక్ష్యమని వెల్లడి  

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్స్) విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు. పి-4 విధానంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు, వర్చువల్‌గా పాల్గొన్న జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పి-4 విధానం ముఖ్య ఆశయమని ఆయన పేర్కొన్నారు. 

పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే పి-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు. పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు తదితరులను ఉగాది రోజు జరిగే పి-4 ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానించి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం ద్వారా పి-4 అమలుకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఎస్ తెలిపారు. 
 
స్వర్ణ ఆంధ్ర విజన్-2047లో భాగంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గం, జల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు గాను ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నోడల్ అధికారికి ఆరుగురు సభ్యుల బృందం.. అంటే గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఐదుగురు, ప్రణాళికా శాఖ ద్వారా ఒక ప్రొఫెషనల్ సహాయపడతారని అన్నారు. ప్రణాళికా శాఖ ద్వారా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరించాల్సి ఉంటుందని ఈ కన్సల్టెన్సీ సర్వేను ఫిబ్రవరి 7వ తేదీ నుండి 22వ తేదీ లోగా సేకరించాల్సి ఉందన్నారు. 
 
తొలుత ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పి-4 విధానం అమలు, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ప్రణాళికలో భాగంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా ప్రణాళికల రూపకల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ఎంఎస్ఎంఇ సర్వే నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

  • Loading...

More Telugu News