Tulasi Reddy: విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడటమంటే.. దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టే: తులసిరెడ్డి

- రాజకీయాల్లో ఉన్నవారికి విశ్వసనీయత ఉండాలన్న జగన్
- చింతామణి పాతివ్రత్యం గురించి మాట్లాడినట్టు ఉందని తులసిరెడ్డి ఎద్దేవా
- విశ్వసనీయత గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని వ్యాఖ్య
రాజకీయాల్లో ఉన్నవారికి విశ్వసనీయత ఉండాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడటమంటే... చింతామణి పాతివ్రత్యం గురించి, దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి, గాడ్సే అహింస గురించి మాట్లాడినట్టు ఉంటుందని చెప్పారు.
తన తండ్రి రాజశేఖరెడ్డి మరణానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కారణమని చెప్పి రిలయన్స్ ఆస్తులపై దాడులు చేయించిన జగన్... ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబానీ సిఫారసు చేసిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. సొంత పేపర్ లేదని, తాను పేదవాడినని అబద్ధం చెప్పారని అన్నారు. సీపీఎస్ రద్దు, పోలవరం, మద్య నిషేధం, అగ్రిగోల్డ్ బాధితులు, రైతు భరోసా, పెట్రో ధరలు.. ఇలా అన్ని విషయాల్లో మాట తప్పారని విమర్శించారు. విశ్వసనీయత గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని అన్నారు.