Illegal Migrants: భారతీయుల బహిష్కరణ కొత్తేమీ కాదు.. ఇప్పటి వరకు అమెరికా బహిష్కరణకు గురైనవారు ఎంతమందంటే..!

- 2009 నుంచి కొనసాగుతున్న బహిష్కరణల పర్వం
- పెద్దల సభలో వివరాలు వెల్లడించిన మంత్రి ఎస్.జైశంకర్
- 2019లో అత్యధికంగా 2,042 మంది భారతీయ అక్రమ వలసదారుల బహిష్కరణ
- ఇప్పటి వరకు మొత్తం 15,668 మందిని బహిష్కరించినట్టు వెల్లడి
తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోంది. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. వారితో వచ్చిన అమెరికా మిలటరీ విమానం బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ కీలక విషయాలు వెల్లడించారు.
2009 నుంచి ఇప్పటి వరకు 15,668 మంది భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించినట్టు జైశంకర్ నిన్న రాజ్యసభకు తెలిపారు. భారత వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ అక్రమ వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా కొనసాగుతోందని చెప్పారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2009లో 734 మంది, 2010లో 799 మంది, 2011లో 597 మంది, 2012లో 530 మంది, 2013లో 515 మంది భారత వలసదారులను అమెరికా వెనక్కి పంపినట్టు జైశంకర్ తెలిపారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు 591 మందిని అమెరికా బహిష్కరించిందని, 2015లో 708 మందిని, 2016లో 1,303 మందిని, 2017లో 1,024 మందిని, 2018లో 1,180 మంది వలసదారులను అమెరికా వెనక్కి పంపిందని వివరించారు.
2019లో అత్యధికంగా 2,042 మంది భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించినట్టు తెలిపారు. 2020లో 1,889, 2021లో 805, 2022లో 862 మంది, 2023లో 617, గతేడాది 1,368 మందిని, ఇప్పుడు 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిందని సభకు వివరించారు. తమ అదుపులో మహిళలు, చిన్నారులు లేరని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) తమకు సమాచారమిచ్చిందని జైశంకర్ తెలిపారు.