Rohit Sharma: ప్చ్... రోహిత్ శర్మ మళ్లీ తక్కువ స్కోరుకే అవుట్!

- నేడు నాగ్ పూర్ లో టీమిండియా, ఇంగ్లండ్ తొలి వన్డే
- టీమిండియా టార్గెట్ 249 రన్స్
- 2 పరుగులకే అవుటైన హిట్ మ్యాన్
టీమిండియా టెస్టు, వన్డే జట్ల సారథి రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఫామ్ లో లేని కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో ఓ మ్యాచ్ కు అతడిని పక్కనబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ లో లయను అందిపుచ్చుకోవడం కోసం ఇటీవల రంజీ క్రికెట్ బరిలో దిగినా కథ మారలేదు. ఇప్పుడు ఇంగ్లండ్ తో తొలి వన్డేలోనూ రోహిత్ ది అదే తీరు!
ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 7 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహ్మద్ బౌలింగ్ లో ఫ్లిక్ షాట్ కొట్టబోయి లివింగ్ స్టన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో మిగతా మ్యాచ్ ల్లోనూ రోహిత్ ఇదే విధంగా ఆడితే... ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి పరిస్థితి ఏమిటన్నది సందేహంగా మారింది.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా... రోహిత్ శర్మ నాయకత్వంలో ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ... ఓపెనర్ గా శుభారంభం ఇవ్వకపోతే ఆ ప్రభావం తర్వాత వచ్చే బ్యాటర్లపై పడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లలో ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ తో మిగిలిన రెండు వన్డేల్లో హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో చూడాలి.
ఇక, నేటి మ్యాచ్ విషయానికొస్తే... నాగపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. 249 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత జట్టు 21 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 38, అక్షర్ పటేల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్ చకచకా 59 పరుగులు చేసి అవుటయ్యాడు. అయ్యర్ 36 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 బంతులాడి 15 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.