YS Jagan: చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమేనని అప్పుడే చెప్పా: జగన్

Former CM Jagan Press Meet

  • చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్ డీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్
  • చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామన్న మాజీ సీఎం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్లు గుర్తుచేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలలోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కారు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు. ఈ తొమ్మిది నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే రూ.80 వేల కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయి ద్వారా రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా రూ. 5 వేల కోట్లు.. మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బటన్ లు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వ పథకాలకు బ్రేక్
తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వలంటీర్లతోపాటు బెవరేజెస్ లోని 18 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు.

పీఆర్సీ చైర్మన్ తో బలవంతంగా రాజీనామా చేయించిన చంద్రబాబు సర్కారు.. ఐఆర్ పేరుతో ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా మూడు డీఏలు పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు. ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదేనని జగన్ చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలను, చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు.

YS Jagan
Ex CM Jagan
Jagan Live
YSRCP
  • Loading...

More Telugu News