Ananya Pandey: 'లైగర్' సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదు: చంకీ పాండే

- డిజాస్టర్ గా నిలిచిపోయిన విజయ్ దేవరకొండ 'లైగర్'
- తాను ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు సెట్ కానని అనన్య చెప్పిందన్న చంకీ పాండే
- తానే ఆమెను ఒప్పించానని వెల్లడి
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఆమె తండ్రి, సీనియర్ నటుడు, నిర్మాత చంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. తాజాగా చంకీ పాండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
'లైగర్' సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదని చంకీ పాండే తెలిపారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అనన్య అసౌకర్యంగా ఫీల్ అయిందని చెప్పారు. తాను చిన్నపిల్లలా కనిపిస్తానని, హీరోయిన్ పాత్రకు సెట్ కానని తనతో చెప్పిందని... అదొక పెద్ద ప్రాజెక్ట్ అని, సక్సెస్ అయితే నీకు చాలా పేరు వస్తుందని ఆమెను తాను ఒప్పించానని తెలిపారు.
సినిమా విడుదలయ్యాక రివ్యూలు చూసిన తర్వాత... అనన్య చెప్పిందే నిజమనిపించిందని చంకీ పాండే చెప్పారు. ఆ పాత్రకు అనన్య చాలా యంగ్ గా అనిపించిందని అన్నారు. ఆ తర్వాత ఆమెకు తాను ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదని... ప్రాజెక్ట్ ల విషయంలో ఆమే నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోందని అన్నారు.