Mangli: మంగ్లీని గుడిలోకి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి.. టీడీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి!

- అరసవిల్లి ఆలయంలోకి మంగ్లీని తీసుకెళ్లిన రామ్మోహన్ నాయుడు
- జగన్ మద్దతుదారు మంగ్లీని ఎలా తీసుకెళతారని ప్రశ్నిస్తున్న టీడీపీ క్యాడర్
- గత ఎన్నికల్లో వైసీపీ తరపున మంగ్లీ ప్రచారం
వైసీపీ నేతలు, మద్దతుదారులు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేసిన అధికారులకు టీడీపీలోని కొందరు నేతలు అండగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలతో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆమధ్య ఒకే వేదికను పంచుకోవడం, ఒకే వాహనంపై ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపిన విషయం విదితమే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురి చేస్తోంది.
సినీ గాయని మంగ్లీ వైసీపీకి గట్టి మద్దతుదారు అనే విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె ప్రచారం చేసింది. ఆ పార్టీ తరపున పాటలు పాడింది. ఫ్యాన్ కు ఓటేస్తే చల్లగా ఉంటామని ప్రచారం చేసింది. టీడీపీ తరపున పాటలు పాడాల్సిందిగా టీడీపీ వర్గాలు ఆమెను సంప్రదిస్తే... తన నోట చంద్రబాబు పేరు ఉచ్ఛరించడం ఇష్టం లేదంటూ తిరస్కరించారనే ప్రచారం జరిగింది.
అలాంటి మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లి ఆలయంలోకి వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవిల్లి ఆలయం వద్ద మంగ్లీ బృందం పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రామ్మోహన్ నాయుడు ఆలయంలోకి వెళుతూ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. దీన్ని టీడీపీ క్యాడర్ తప్పుపడుతున్నారు.
జగన్ కు మద్దతిచ్చిన మంగ్లీని వెంట తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం ఎలా చేయిస్తారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీరావును రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.