Bangabandhu: బంగ్లాదేశ్‌లో మళ్లీ విధ్వంసం.. బంగ్లాదేశ్ జాతిపిత నివాసానికి నిరసనకారుల నిప్పు.. వీడియో ఇదిగో!

- షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసానికి నిప్పు పెట్టిన నిరసనకారులు
- షేక్ హసీనా సోషల్ మీడియాలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఘటన
- ఆ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమన్న నిరసనకారులు
- 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిన
బంగ్లాదేశ్‌లో నిరసనకారులు మరోమారు రెచ్చిపోయారు. ఆ దేశ జాతిపిత (బంగబంధు) షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడిచేసి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లు, విధ్వంసం తర్వాత పదవి కోల్పోయి, భారత్ కు వచ్చేసిన అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు.
షేక్ హసీనా తాజాగా సోషల్ మీడియాలో ప్రసంగిస్తూ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఢాకాలో ఆమెకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాసంపై నిరసనకారులు దాడికి దిగి, దానికి నిప్పు పెట్టారు.
బంగబంధు నివాసానికి నిప్పు పెట్టడంపై హసీనా స్పందిస్తూ.. వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు కానీ, చరిత్రను కూల్చలేరని, దీనిని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోవైపు, బంగబంధు ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసనకారులు పేర్కొన్నారు. 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ కు బంగబంధుగా పేరుంది. భారత్ సాయంతో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని పూర్తిచేయడంలో ఆయన విజయం సాధించారు. అయితే, 1975లో ఆయన అధికారిక నివాసంపై దాడిచేసిన సైన్యం ఆయనతోపాటు ఇంట్లో ఉన్న 18 మందిని చంపేసింది. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటంతో ప్రాణాలతో మిగిలిపోయారు. కాగా, హసీనా పాలనలో ముజిబుర్ నివాసాన్ని మ్యూజియంగా మార్చారు.