Shabbir Ali: సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి ఉండవచ్చు: రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ లేఖ

Shabbir Ali letter to CM Revanth Reddy

  • సమగ్ర కుటుంబ సర్వేలో ఆర్థికపరమైన దుర్వినియోగం జరిగిందని ఆరోపణ
  • సున్నితమైన పౌరుల సమాచారాన్ని ఇతరులకు బదిలీ చేసి ఉంటారన్న మాజీ మంత్రి
  • సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరపాలని విజ్ఞప్తి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో ఆర్థికపరమైన దుర్వినియోగం జరిగిందని, ఈ విషయమై సీఐడీ విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేఖ రాశారు.

2014లో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించి, వాస్తవాలు వెలికి తీయాలని ఆయన కోరారు. ఆ సమయంలో సర్వేలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

బీఆర్ఎస్ సుమారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సర్వేకు సంబంధించిన గణాంకాలను అధికారికంగా విడుదల చేయలేదని ఆయన అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. వారు ప్రజల ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించినట్లు వెల్లడించారు.

మొత్తం 94 అంశాలతో సమాచారం సేకరించారని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సర్వే కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని, అయినప్పటికీ ఈ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. ఈ సర్వే ద్వారా ఆర్థికపరమైన దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు విక్రయించి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు పౌరుల డేటాను ఇతరులకు బదిలీ చేసి ఉంటారనే అనుమానం కలుగుతోందన్నారు. దర్యాప్తు జరిపితే అన్ని వివరాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News