Raghunandan Rao: ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాను: రఘునందన్ రావు హెచ్చరిక

- రాత్రికి రాత్రే డంపింగ్ యార్డును ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఎంపీ
- పట్టణాల్లోని చెత్తను గ్రామాల్లోకి తరలిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
- సంగారెడ్డిని మరో జవహర్‌నగర్‌గా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపణ
సంగారెడ్డి జిల్లాలో రాత్రికి రాత్రే డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. పట్టణాల్లోని చెత్తను గ్రామాల్లోకి తరలిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. సంగారెడ్డి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ కలిసి తమ ప్రాంతాల్లోని భూములను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డిని మరో జవహర్ నగర్‌గా మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే పరిశ్రమల వ్యర్థాలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారని తెలిపారు. జిన్నారం, పారా నగర్ గ్రామాలను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇక్కడ చెత్తశుద్ధి కోసం 150 ఎకరాలను కేటాయించిందని అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దారిలోనే నడుస్తోందని ఆయన విమర్శించారు. డంపింగ్ యార్డు వద్దంటూ నిరసన తెలుపుతున్న తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులను ఎంపీ ఖండించారు.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన
గుమ్మడిదల మండలం పారా నగర్‌లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఈరోజు ఉదయం నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.