Ponnam Prabhakar: ఒకరికే మూడు పదవులు ఉండటంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడం లేదు: పొన్నం ప్రభాకర్

- రాష్ట్రంలో కుల గణన జరగకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపణ
- కుల గణనలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు లేదన్న మంత్రి
- కుల గణనలో జరిగిన పొరపాటు ఏమిటో చెప్పాలని నిలదీత
ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో మూడు కీలక పదవులు ఒకరికే ఉండటంపై ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కుల గణన జరగకుండా బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్‌లో పదవులన్నీ ఒకే వ్యక్తికి కట్టబెట్టారని విమర్శించారు. కుల గణనలో పాల్గొనని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. కుల గణన సర్వే ద్వారా బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.
కుల గణనలో జరిగిన పొరపాటు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన సూచనలు చేస్తే బాధ్యతగా స్వీకరించి సరిదిద్దుతామని అన్నారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగానే అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.