Etela Rajender: తనకు కేసీఆర్ ఫోన్ చేశారనే వార్తలపై ఈటల రాజేందర్ స్పందన

- ఈటలను మళ్లీ బీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ పిలిచారంటూ ప్రచారం
- తనంటే గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఈటల
- తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని వ్యాఖ్య
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని... మళ్లీ కలిసి పని చేద్దామని కేసీఆర్ పిలిచారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై ఈటల స్పందించారు.
ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఈటల కొట్టిపడేశారు. తానంటే గిట్టని వాళ్లు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ గురించి తాను స్పష్టంగా తన అభిప్రాయాలను చెపుతున్నప్పటికీ... కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
పార్టీలు మారడం అనేది పిల్లల ఆటకాదని ఈటల వ్యాఖ్యానించారు. తామంతా బాధ్యత గల పొలిటీషియన్లమని చెప్పారు. వాళ్లది వాళ్ల పార్టీ, తమది తమ పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదని... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో కూడా శాస్త్రీయత లోపించిందని విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బీసీ-ఈ గ్రూపు తీసుకొచ్చారనేది తప్పుడు వాదన అని ఈటల అన్నారు. అంతకు ముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూపులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించిన తర్వాతే కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి చేయకుండా కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని... దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదని చెప్పారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు తాను విద్యార్థి సంఘాలలో చురుకుగా ఉండేవాడినని ఈటల తెలిపారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో తాను చదువుకున్నానని... విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. విద్యార్థుల హక్కుల కోసం ఎప్పుడూ నిలబడతానని అన్నారు. ఎంతో నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని తానని చెప్పారు.