Indian Migrants: భార‌త్ చేరుకున్న వ‌ల‌స‌దారుల విమానం

US Aircraft Carrying Illegal Indian Migrants Lands in Amritsar

  • అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ స‌ర్కార్‌
  • చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో ఉంటున్న‌ భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన అమెరికా
  • 205 మంది భార‌తీయుల‌తో టెక్సాస్ నుంచి అమృత్‌స‌ర్ చేరుకున్న విమానం

అగ్ర‌రాజ్యం అమెరికాలో కొత్త‌గా ఏర్పాటైన‌ డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతోంది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై మొద‌టి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్‌.. అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వారి గుర్తింపు, త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో కొంత‌మంది భార‌తీయుల‌ను కూడా వెన‌క్కి పంపిన సంగ‌తి తెలిసిందే. 

సరైన ధ్రువపత్రాలు లేకుండా, చ‌ట్ట‌విరుద్ధంగా త‌మ దేశంలోకి అడుగుపెట్టిన భార‌త పౌరుల‌ను ప్ర‌త్యేక విమానంలో స్వ‌దేశానికి పంపింది. దాంతో 205 మంది భార‌తీయుల‌తో టెక్సాస్ నుంచి బ‌య‌ల్దేరిన అమెరికా సైనిక విమానం సీ-17 ఈరోజు మ‌ధ్యాహ్నం అమృత్‌స‌ర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. 

కాగా, ప్ర‌త్యేక‌ విమానంలో స్వ‌దేశానికి వ‌చ్చిన వారంతా పంజాబ్‌, దాని చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల‌కు చెందినవార‌ని స‌మాచారం. అవ‌స‌ర‌మైన సోదాల అనంత‌రం వారిని విమానాశ్ర‌యం నుంచి బ‌య‌టకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో మ‌రిన్ని విమానాలు అమెరికా నుంచి భార‌త్‌కు రానున్నాయ‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.

ఇదిలాఉంటే... యూఎస్ హోంలాండ్ అధికారుల గ‌ణాంకాల ప్ర‌కారం 20,407 మంది ఇండియ‌న్స్ వ‌ద్ద సరైన ధ్రువపత్రాలు లేన‌ట్లు తేలింది. వీరిలో 17,940 మందిని వెన‌క్కి పంపేందుకు తుది ఉత్త‌ర్వులు జారీ చేశారు. 2,467 మంది ఈఆర్ఓ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రిమూవ‌ల్ ఆప‌రేష‌న్స్‌) నిర్బంధంలో ఉన్నారు. మొద‌టి విడ‌త‌లో భాగంగా 205 మందిని వెన‌క్కి పంపించారు. 

  • Loading...

More Telugu News