Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ

Minister Nara Lokesh Meeting with Dharmendra Pradhan

  • ఏపీలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించాలని విన‌తి
  • పీఎం శ్రీ పథకంలో మరో 1,514 పాఠశాలలకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి
  • పూర్వోదయ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు చేయాల‌ని అభ్య‌ర్థ‌న‌

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంను ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. 

విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాంక్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యావ్యవస్థ కుంటుపడిందన్నారు. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్దఎత్తున బకాయిలు ఉన్నాయని తెలిపారు. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచాల‌ని కోరారు. 

ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్‌ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంద‌న్నారు. ఇందుకు అధిక బడ్జెట్ కేటాయింపు అవసరం అవుతాయ‌ని, 2025-26 బడ్జెట్ లో ఏపీకి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరామ‌న్నారు.

రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద ఏర్పాటైన పాఠశాలలు అద్భుతమైన పురోగతిని కలిగి ఉన్నాయ‌ని తెలిపారు. ఈ కారణంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. పీఎం శ్రీ ఫేజ్ -1, 2 లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు గాను 855కు మాత్రమే మంజూరయ్యాయ‌ని తెలిపారు. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ – 3 పీఎం శ్రీలో మంజూరు చేయండి. 

ఏపీలో ఉన్నత విద్య అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద పెద్ద ఎత్తున సాయం అందించండి. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,229 కోట్లు, రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి రూ. 555 కోట్లు, ఇప్పటికే పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబరేటరీలు, లైబ్రరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.330 కోట్లు మంజూరు చేయండి. 

కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు చెరో రూ.50 కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు రూ.150 కోట్లు, రెండు మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రూ.30 కోట్లు, రూ. 250 కోట్లతో ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాల‌ని మంత్రికి లోకేశ్ విజ్ఞ‌ప్తి చేశారు. 

4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్ లను ఏర్పాటు చేసేందుకు రూ.20 కోట్ల చొప్పున రూ. 80 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు రూ. 50కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి రూ. 80కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు రూ.180కోట్లు మంజూరు చేయాల‌ని కోరారు. రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.  

  • Loading...

More Telugu News