Madhavan: కోహ్లీ వీడియో విషయంలో బోల్తా పడ్డా.. అనుష్క మెసేజ్ తో నిజం తెలిసిందన్న మాధవన్

- ఏఐ వల్ల తాను కూడా మోసపోయానని వెల్లడించిన హీరో
- కోహ్లీని ప్రశంసించిన రొనాల్డో వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన మాధవన్
- అది ఫేక్ వీడియో అంటూ అనుష్క తనకు మెసేజ్ చేసిందని వివరణ
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తాను కూడా మోసపోయానని ప్రముఖ నటుడు మాధవన్ వెల్లడించారు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో విషయంలో ఏఐ తనను బోల్తా కొట్టించిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నప్పటికీ ఆ వీడియో ఫేక్ అనే విషయం గుర్తించలేకపోయానని చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ మెసేజ్ చేశాక కానీ తనకు అసలు విషయం తెలియలేదని వివరించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ తాను ఏఐతో ఎలా మోసపోయింది వివరించారు.
గతంలో తాను సోషల్ మీడియాలో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించిన వీడియో ఒకటి చూశానని మాధవన్ చెప్పారు. అందులో రొనాల్డో మన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించడం తనకు చాలా బాగా నచ్చిందని వివరించారు. ఆ వీడియోను తాను తన ఇన్ స్టాలో షేర్ చేశానని, ఆ తర్వాత కాసేపటికే అనుష్క శర్మ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు. రొనాల్డో వీడియో ఫేక్ అని, ఏఐ సాయంతో సృష్టించిన వీడియో అని అనుష్క చెప్పిందన్నారు. ఆ నిమిషంలో తనకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని, వెంటనే వీడియోను డిలీట్ చేశానని మాధవన్ వివరించారు. టెక్నాలజీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని, ఏ వీడియో అయినా లేక పోస్ట్ అయినా షేర్ చేసేముందు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాధవన్ పేర్కొన్నారు.