Cancer Screening: ఏపీలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం: ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్

- రొమ్ము, గర్భాశయ, గొంతు క్యాన్సర్ లకు సంబంధించిన ఉచిత పరీక్షలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో పరీక్షలు
- ఇప్పటిదాకా 71 లక్షల మందికి పరీక్షలు... వారిలో 66 వేల మందికి క్యాన్సర్ లక్షణాలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ నేడు కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. రొమ్ము, గర్భాశయ, గొంతు క్యాన్సర్ లకు సంబంధించిన ఉచిత పరీక్షలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,500 టీమ్ లను ఏర్పాటు చేశామని, 4 వేల మంది డాక్టర్లు, 18 వేల మంది పీహెచ్ సీ సిబ్బంది, 4 వేల మంది ఏఎన్ఎమ్ లు ఈ టీమ్ లలో ఉంటారని... వీరితో పాటే 155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 మంది స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉంటారని మంత్రి సత్యకుమార్ వివరించారు.
గ్రామాల్లోని ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో ఈ ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని... ఇప్పటిదాకా 71 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వారిలో 66 వేల మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని వివరించారు.
వారిని మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లోని క్యాన్సర్ నివారణ విభాగాలకు పంపిస్తామని తెలిపారు. అక్కడ వారికి మంగళవారం, గురువారం రోజుల్లో టెస్టులు నిర్వహించి, క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారని వెల్లడించారు. తిరుపతిలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నారు.