Varun Chakravarthy: ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు టీమిండియాలో మిస్టరీ స్పిన్నర్ కు చోటు

- ఫిబ్రవరి 6 నుంచి భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్
- 15 మందితో తొలుత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- 16వ ఆటగాడిగా వరుణ్ చక్రవర్తి ఎంపిక
- ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో రాణించిన వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను గెలిచి ఊపుమీదున్న టీమిండియా... అదే ఊపులో వన్డే సిరీస్ కూడా గెలవాలని తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న జరగనుంది. కాగా, ఈ సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించారు. అయితే, చివరి నిమిషంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా జట్టులో చోటు కల్పించారు.
ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో రాణించడం వరుణ్ చక్రవర్తికి కలిసొచ్చింది. ఈ సిరీస్ లో 5 మ్యాచ్ లు ఆడిన వరుణ్ చక్రవర్తి 14 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. స్పిన్ కు అనుకూలించే భారత పిచ్ లపై వరుణ్ చక్రవర్తి భారీ హిట్టర్లతో కూడిన ఇంగ్లండ్ లైనప్ కు వన్డేల్లోనూ కళ్లెం వేస్తాడని బీసీసీఐ భావిస్తోంది.
వాస్తవానికి రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో తొలుత జట్టును ప్రకటించగా, అందులో వరుణ్ చక్రవర్తి పేరు లేదు. అయితే, అతడిని కూడా జట్టులో చేర్చుతున్నామంటూ బీసీసీఐ విడిగా ఓ ప్రకటన చేసింది.
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.