Pawan Kalyan: నిర్మాత ఏ.ఎం. రత్నంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- పవన్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న ఏ.ఎం. రత్నం
- నేడు ఏ.ఎం. రత్నం పుట్టినరోజు
- విషెస్ తెలుపుతూ ప్రకటన విడుదల చేసిన పవన్
ప్రముఖ సినీ నిర్మాత ఏ.ఎం. రత్నం ఇవాళ (ఫిబ్రవరి 4) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ఓ ప్రకటన విడుదల చేశారు.
"ప్రముఖ సినీ నిర్మాత, సన్నిహితులు, మిత్రులు అయిన ఏ.ఎం. రత్నం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాను. సినీ నిర్మాతగానే కాకుండా రచయితగా ఎన్నో కథలు, లిరిక్ రైటర్ గా ఎన్నో పాటలు అందించారు. ఏ.ఎం. రత్నం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.
పలు భాషలో ప్రపంచ స్థాయి చిత్రాలను నిర్మించి, సందేశాత్మక చిత్రాలు అందించడంలో గొప్ప పేరు సంపాదించారు. ఏ.ఎం. రత్నం గారితో నాకు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా మంచి అనుబంధం ఉంది. భవిష్యత్తులో ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఏ.ఎం. రత్నం... పవన్ హీరోగా వస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రానికి నిర్మాత అని తెలిసిందే. పవన్ కల్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి కూడా ఏ.ఎం. రత్నం నిర్మాత.