YS Sharmila: తెలంగాణ కుల గణనపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు... చంద్రబాబుకు కీలక సూచన

YS Sharmila responds on Caste Census

  • తెలంగాణలో కుల గణన దేశానికే ఆదర్శం, చారిత్రాత్మకమన్న షర్మిల
  • తెలంగాణ తరహాలో చంద్రబాబు కుల గణన చేయాలని డిమాండ్
  • సుమారు 90 శాతం ప్రజలు బలహీన వర్గాలే ఉండటం విస్మయపరిచిందని వ్యాఖ్య
  • ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నామన్న షర్మిల

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు ప్రభుత్వం కుల గణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కుల గణన చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆమె ఒక ట్వీట్ చేశారు.

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయానికి గురిచేసింది" అని ఆమె పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నామని, మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని ఆమె కోరారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్యను తేల్చాల్సి ఉందన్నారు.

కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు. మనం ఎంత మంది ఉన్నామో మనకంత దక్కాలి అన్నట్లుగా... రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో ఎవరి వాటా వారికి దక్కాలన్నారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా, బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కి పెట్టారని ఆమె ఆరోపించారు. సర్వే వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని, బీజేపీ డైరెక్షన్‌లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని ఆమె విమర్శించారు. 

దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పుదారి పట్టిస్తోందన్నారు. ఇక్కడ చంద్రబాబు బీజేపీ ఉచ్చులో పడవద్దని, వెంటనే కులగణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

YS Sharmila
Telangana
Congress
Revanth Reddy
Chandrababu
  • Loading...

More Telugu News