Virat Kohli: సచిన్ ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli On Brink Of History Set To Break Sachin Tendulkar All Time Record

  • అత్యంత వేగంగా 14 వేల‌ వన్డే పరుగుల మైలురాయికి 94 ర‌న్స్ దూరంలో కోహ్లీ
  • ఈ ఫీట్‌ను సాధించ‌డానికి 350 ఇన్నింగ్స్ లు ఆడిన స‌చిన్ 
  • 283 వన్డే ఇన్నింగ్స్ లలోనే 13,906 పరుగులు చేసిన కోహ్లీ 
  • గురువారం నుంచి ప్రారంభ‌మ‌య్యే వ‌న్డే సిరీస్‌లో విరాట్‌ ఈ ఫీట్‌ను అందుకునే ఛాన్స్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన ఓ ఆల్ టైమ్ రికార్డుపై టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ క‌న్నేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి ర‌న్ మెషీన్‌కి కేవ‌లం 94 పరుగులు కావాలి. ఈ నెల 6 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో ఆడనున్న కోహ్లీ ఆ రికార్డును అందుకునే అవ‌కాశం ఉంది. 

ఇంత‌కీ ఆ రికార్డు ఏంటంటే.. అత్యంత వేగంగా 14 వేల‌ వన్డే పరుగుల మైలురాయి. ఈ ఫీట్‌ను న‌మోదు చేయ‌డానికి స‌చిన్ 350 ఇన్నింగ్స్ లు ఆడాడు. 

అదే కోహ్లీ విషయానికొస్తే... ప్ర‌స్తుతం 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటు, 93.54 స్ట్రైక్ రేట్‌తో 13,906 పరుగులు చేశాడు. రాబోయే మూడు మ్యాచ్ ల సిరీస్ లో మ‌రో 94 ర‌న్స్ చేస్తే... అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లీ అవ‌త‌రిస్తాడు. 

కాగా, 2006 ఫిబ్రవరిలో పెషావర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో అతను సెంచరీ కూడా చేశాడు. కానీ, భారత్ 7 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి) మ్యాచ్‌లో ఓడిపోయింది.

మరోవైపు కోహ్లీ వ‌న్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు బాదిన విష‌యం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ 50 ఓవ‌ర్ల‌ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట‌ర్‌గా స‌చిన్‌ (49)ను అధిగమించాడు. ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ (463 వన్డేల్లో) 18,426 పరుగులతో అగ్ర‌స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News