Dimuth Karunaratne: వందో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక స్టార్ ప్లేయ‌ర్‌ అల్వీదా

Dimuth Karunaratne to Retire from International Cricket after Making His 100th Appearance

  • అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ దిముత్ కరుణరత్నే 
  • ఆస్ట్రేలియాతో గాలేలో జరిగే రెండో టెస్ట్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై 
  • ఇటీవల బ్యాటింగ్‌లో ఘోరంగా విఫ‌లం అవుతున్న‌ 36 ఏళ్ల కరుణరత్నే 
  • ఈ నేప‌థ్యంలోనే క్రికెట్ నుంచి రిటైర్ కావాల‌ని నిర్ణయం

ఆస్ట్రేలియాతో గాలేలో జరిగే రెండో టెస్ట్ తర్వాత దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఇది శ్రీలంక మాజీ కెప్టెన్ కు 100వ టెస్ట్ మ్యాచ్ కూడా. ఇటీవల బ్యాటింగ్‌లో నిలకడగా రాణించలేకపోతున్న 36 ఏళ్ల కరుణరత్నే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

గ‌త కొంత‌కాలంగా పేలవమైన ఫామ్ కార‌ణంగా ఈ స్టార్ ప్లేయ‌ర్‌ తన చివరి ఏడు టెస్ట్ మ్యాచ్ లలో కేవ‌లం 182 పరుగులు మాత్రమే చేశాడు. 2024 సెప్టెంబర్ లో న్యూజిలాండ్ పై న‌మోదు చేసిన‌ ఏకైక అర్ధ సెంచరీయే ఇటీవల కాలంలో కరుణరత్నే అత్య‌ధిక స్కోరు. 

2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా కరుణరత్నే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అతను డకౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఆ త‌ర్వాత నుంచి వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుని శ్రీలంక  టెస్టు జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా ఎదిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు కరుణరత్నే 99 టెస్ట్ మ్యాచ్ ల‌లో 7,172 పరుగులు చేశాడు. వాటిలో 16 సెంచరీలు ఉన్నాయి. 2021లో బంగ్లాదేశ్‌పై అతను అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోరు 244 న‌మోదు చేశాడు. 

2014లో క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌పై తొలి టెస్టు సెంచరీ చేశాడు. ఆ త‌ర్వాత 2015 నుంచి స్థిరంగా పరుగులు చేస్తూ, శ్రీలంక తరఫున టెస్టుల్లో శాశ్వత ఓపెనర్‌గా మారాడు. గత దశాబ్దంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణించిన‌ ఓపెనర్లలో కరుణరత్నే ఒకడు. 2017లో పాకిస్థాన్‌పై డే-నైట్ టెస్ట్‌లో 196 పరుగులు చేయ‌డం అత‌ని టెస్టు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.  

2019లో శ్రీలంక జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అదే సంవత్సరం దక్షిణాఫ్రికాపై త‌న జ‌ట్టుకు టెస్ట్ సిరీస్ విజయాన్ని (2-0) అందించాడు. త‌ద్వారా దక్షిణాఫ్రికాను సొంత గ‌డ్డ‌పై ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచిన‌ మొదటి ఆసియా జట్టుగా శ్రీలంక నిలిచింది. టెస్ట్ క్రికెట్‌లో శ్రీలంక తరఫున నిలకడగా ఆడిన క‌రుణ‌ర‌త్నే... వ‌న్డేలు, టీ20ల్లో కూడా ప్రాతినిధ్యం వ‌హించాడు. శ్రీలంక త‌ర‌ఫున‌ 50 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. 

ఇక టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా కరుణరత్నే 2018, 2021, 2023 సంవత్సరాల్లో 'ఐసీసీ టెస్ట్ క్రికెట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌' కు ఎంపికయ్యాడు.

  • Loading...

More Telugu News