Abhishek Sharma: మెచ్చుకున్న మెంటార్ యువరాజ్.. అభిషేక్ రిప్లై ఇదే..!

- వాంఖడేలో భారీ శతకంతో అదరగొట్టిన అభిషేక్
- 37 బంతుల్లోనే సెంచరీ బాదిన యువ బ్యాటర్
- తన శిష్యుడు అద్భుతంగా రాణించడంపై యువీ ట్వీట్
- గురువు ట్వీట్‌కి తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన అభిషేక్
ముంబయిలోని వాంఖడేలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేసి, ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 13 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
ఇక అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మెంటార్ అనే విషయం తెలిసిందే. అతని మార్గదర్శకత్వంలోనే ఈ యువ క్రికెటర్ రాటుదేలాడు. ఇప్పుడు భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గురువుకు తగ్గ శిష్యుడు అని అనిపించుకుంటున్నాడు.
కాగా, తన శిష్యుడు అద్భుతంగా రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యువీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. "బాగా ఆడావు అభిషేక్. నేను నిన్ను ఎక్కడ చూడాలనుకున్నానో ఈరోజు నీవు అక్కడ ఉన్నందుకు నిన్ను చూసి గర్వపడుతున్నాను" అని యువీ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి తాజాగా అభిషేక్ శర్మ తనదైనశైలిలో రిప్లై ఇచ్చాడు.
యువరాజ్ సింగ్ పోస్ట్‌పై అభిషేక్ మాట్లాడుతూ.. "యువరాజ్.. 'నేను చప్పల్ పంపుతాను' అని జోడించకుండా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నా. ఏదైతేనేం.. అతను నా గురించి గర్వపడుతున్నాడు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని మ్యాచ్ తర్వాత అభిషేక్ అన్నాడు.