Nara Lokesh: ప్రైవేటు పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh held meeting with private schools managements

  • ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశం
  • ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ
  • ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని వెల్లడి

ఏపీలోని ప్రైవేటు పాఠశాలలకు రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తియ్యని కబురు చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి నారా లోకేశ్ నేడు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పడదాం... అందరం కలిసి విద్యావ్యవస్థను బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు. 

"కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది. విద్యాశాఖ మంత్రిగా నాపై పవిత్ర బాధ్యత ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వలన లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. 

వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పాఠశాల విద్యలో సంస్కరణలపై మేం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళుతున్నాం. నేను ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నా. వైసీపీ పాలనలో గందరగోళంగా మారిన విద్యావ్యవస్థను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం. మేం చిత్తశుద్ధితో చేయాలనే తపనతో ఉన్నాం.

విద్యా రంగంలో ప్రైవేటుకు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. యువగళం పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయి. పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతాం. ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం" అని చెప్పారు.

ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలని కోరారు. క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఫైర్ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్ మంజూరును సులభతరం చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. 

ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు అర్హత లేని ఉపాధ్యాయులకు డీఎల్ఈడీ చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ప్రైవేటు స్కూల్ బస్సులు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి కాలపరిమితి రెండేళ్లు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు మీడియం ప్రైవేటు పాఠశాలలు 150 వరకు ఉన్నాయని, వాటిని ఇంగ్లీషు మీడియంగా కన్వర్షన్ చేయాలని అభ్యర్థించారు.

"బడ్జెట్ స్కూల్స్ కు రుణ సదుపాయం కల్పించాలి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలి. ప్రైవేటు స్కూల్స్ ను కేటగిరైజ్ చేసే అంశాలన్ని పరిశీలించాలని సూచించారు. ప్రేవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి. 

పదో తరగతిలో తిరిగి గ్రేడింగ్ సిస్టమ్ ను తీసుకురావాలి. ఓపెన్ స్కూల్స్ కు కూడా గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలి. ముంపు మండలాల్లో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. స్కూల్ బస్సుల విషయంలో పన్నుల భారాన్ని తగ్గించాలి" అని కోరారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు వివిధ ప్రైవేటు స్కూల్స్ అసిసోయేషన్ ప్రతినిధులు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News